Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతిలో జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు సిఐటియు నాయకత్వం కార్మిక సమస్యలపై భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించబోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి పచ్చి వ్యతిరేకతతో ఉన్నాయి. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్ని రంగాల కార్మికులకు సిఐటియు విజ్ఞప్తి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సమస్యలపై ప్రకటన చేసింది. ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాన్ని మోసపుచ్చే వైఖరితో ఉంది. దీనిని సిఐటియు ఖండిస్తున్నది. గ్యారంటీ పెన్షన్ స్కీంలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెన్షన్ గ్యారంటీ ఏమీ లేదు. దీనిని అందరూ వ్యతిరేకిస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంలో ఉన్న 10% కార్మికులకు చెల్లించాలనే విధానమే ఇందులో కూడా ఉంది. పెన్షన్ కోసం కార్మికుల జీతంలో చెల్లించే 10% మాత్రమే గ్యారంటీ చేశారు. దీనినే నేతి బీరకాయలో నెయ్యి చందంగా భావించవచ్చు. కార్మికులకు చెల్లించే పెన్షన్లో గ్యారంటీ లేదు. కాంట్రాక్టు కార్మికులను 10,117 మందిని పర్మినెంట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కానీ, పాదయాత్రలో కానీ 2.4 మంది లక్షల మంది కాంట్రాక్ట్ , అవుట్ సోర్స్ ఉద్యోగులను మొత్తంగా పర్మినెంట్ చేస్తామన్న వాగ్దానం నీటి మూట లాగా అయ్యింది. నేషనల్ హెల్త్ మిషన్, మున్సిపల్, టిటిడి, స్విమ్స్ ఆసుపత్రి, ఉపాధి పథకం, వెలుగు ఐకెపి, కస్తూరిబా విద్యా కేంద్రం, ప్రభుత్వరంగ సంస్థలలో ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా పర్మినెంట్ కావడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడం వాస్తవానికి బోగస్ అని తేలిపోయింది. పిఆర్సి మరియు డిఏ బకాయిల చెల్లింపుకు నాలుగు సంవత్సరాల సమయం తీసుకోవడం వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరిగింది. యూనివర్శిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులకు పిఆర్సి జీతాలు అమలు చేయకపోవటం, వయస్సు పరిమితిని 62 సంవత్సరాలకు పెంచకపోవడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో ప్రథమ స్థానంలో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్నది. తిరుమల, తిరుపతి దేవస్థానంలో పాతికేళ్లకు పైగా పని చేస్తున్న అటవీ కార్మికులు రెగ్యులరైజేషన్ కొరకు 945 రోజులుగా | నిరాహార దీక్షలు చేస్తున్నారు. దశాబ్దాలుగా టిటిడిలో కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నా రెగ్యులరైజేషన్ కు నోచుకోలేదు. స్కీం కార్మికులు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం అనేక సంవత్సరాల నుండి జీతాలు పెంచాలని పోరాడుతున్నా కనీసం తెలంగాణాతో సమానంగా జీతాలు కూడా పెంచలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాట్యూటీ చెల్లించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నేటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అసెంబ్లీ సమావేశాలలో జరిగిన చర్చలో అంగన్వాడీ నాయకులతో చర్చిస్తామని ఇచ్చిన హామీని కూడా నేటికీ అమలు చేయలేదు. పిఆర్సి జరిగిన పదిహేను మాసాలు పూర్తవుతున్నా కూడా విద్యుత్ కార్మికులకు నేటికీ పిఆర్సి ఒప్పందమే జరగలేదు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ ఊసే లేదు. తెలంగాణాలో పెంచిన విధంగా జీతాల పెంపు గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల సమస్యలను సిఐటియు రాష్ట్ర కమిటి చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి తిరుపతి వేదిక కాబోతున్నదని తెలియజేస్తున్నాము. ఈ మీడియా సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్శింగరావు, రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, కోశాధికారి కేఎన్ఎన్ ప్రసాదరావు, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్. వాణిశ్రీ,, టిటిడి ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు జి. వెంకటేష్, ఎపి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి ఛైర్మన్ జి. నాగవెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV