Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : కుప్పం, జూన్ 10: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియలపై బుధవారం ఉదయం కుప్పంలోని ఎం.ఎం. మహల్‌లో బూత్ లెవల్ అధికారులతో (బీఎల్వోలు) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) క్షేత్రస్థాయి సర్వేపై రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో బీఎల్వోలు పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. 2025 ఓటర్ల జాబితాలను 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేయాలని, వలస వచ్చినవారు మరియు తాత్కాలిక నివాసంలో ఉన్న వారి వివరాలను వారి స్వస్థల ఓటర్ల జాబితాలోని తండ్రి, తాతల పేర్లతో సరిపోల్చి పరిశీలించాలని తెలిపారు. మృతి చెందిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లను గుర్తించి తగిన ఆధారాలు, పత్రాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు నిర్వహించే డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. ఓటర్ల వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత ఓటర్లకు అందించి, వివరాలను పరిశీలించి కలర్ ఫోటోతో పాటు సంతకాలు తీసుకోవాలని సూచించారు. సరిపోలని వివరాలను మాస్టర్ డేటాతో తనిఖీ చేసి, ఎన్నికల డేటా బృందంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయి సర్వే, మ్యాపింగ్, డిలీషన్ అంశాలపై ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల డీటీ, ఏఈఆర్వో, ఈఆర్వోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకతతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీడీ కడ వికాస్ మర్మట్, డీఆర్ఓ మోహన్ కుమార్ కుప్పం ఆర్డీవో, మరియు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Admin
Famous TV