Famous TV - జాతీయ వార్తలు / : దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు. ప్రారంభ జీవితం ----------------------- మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన రెండవ సంతానంగా జన్మించిన భాగయ్య, ఆ తర్వాత కాలంలో తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడు. 1888 నవంబరులో వారి కుటుంబ గురువు వారిని సందర్శించడానికి వచ్చి పిల్లవానికి భాగయ్యకు బదులు భాగ్యరెడ్డి అని నామకరణం చేశాడు. భాగ్యరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి ఐదుగురు సంతానాన్ని ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ పోషించింది. 18 ఏళ్ళ వయసులో భాగ్యరెడ్డికి లక్ష్మీదేవితో వివాహం జరిగింది. ఈయనకు ఒక శిక్షకుడు ఉండేవాడు కానీ సాంప్రదాయక విద్యాభ్యాసం లేదు. తెలుగు చదవటం, వ్రాయటం మాత్రం వచ్చేది. గోవాకు చెందిన బారిస్టరు దోసా శాంటోస్ ఈయనకు ఆశ్రయమిచ్చి, తిండి పెట్టి తన ఇంటి యొక్క మొత్తం యాజమాన్యాన్ని మరియు ఆరుగురు సేవకుల అజమాయిషీని భాగ్యరెడ్డి చేతుల్లో పెట్టాడు. ఈ విధంగా 1912 మే వరకు కొనసాగాడు. ఆ తరువాత విద్యుచ్ఛక్తి శాఖలో వైర్‌మ్యాన్ గా పనిచేశాడు. ఆ తరువాత జీవన్ రక్షా మండలికి చెందిన లాల్జీ మేఘాజీ, భాగ్యరెడ్డిని ప్రచారకునిగా నియమించి, నెలకు అరవై రూపాయల జీతం, తిరగటానికి మోటరుసైకిలు ఏర్పాటు చేశాడు. దళిత సమాజోద్ధరణ ------------------------------ భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యను నేర్పడం కోసం హైదరాబాదు లోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించాడు. హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910వ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. భాగ్య రెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్దరణకై 1911లో మన్యసంఘాన్ని ఏర్పాటుచేశాడు. అప్పటి నుండి జగన్మిత్ర మండలి యొక్క కార్యకలాపాలు మన్యసంఘం ద్వారా కొనసాగించాడు. మన్యసంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు మరియు ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నించింది. కొంతమంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండళ్లను ప్రోత్సహించారు. మన్యసంఘం ఆధ్వర్యంలో ఈ భజన మండళ్లు రీడింగ్ రూములు ఏర్పరచి అందులో ఆంధ్రప్రత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచాయి. ఈ సంస్థ బాల్య వివాహాలను నిర్మూలించడం, దేవదాసి, జోగిని వంటి దురాచారాలు నిర్మూలించడం కోసం పనిచేసింది. ఈ సంస్థ కృషివల్ల నిజాం దేవదాసి వ్యవస్థను నిర్మూలించాడు. ఒక దశాబ్దం తర్వాత 1921లో మన్యసంఘం యొక్క పేరును మార్చి ఆది-హిందూ సోషల్ సర్వీసు లీగు అని నామకరణం చేశారు.
1917లో విజయవాడలో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆంధ్ర పంచమ మహాజనసభ, తొలి ఆది ఆంధ్ర మహాజనసభగా రూపాంతరం చెందింది. అధ్యక్ష ప్రసంగం చేస్తూ భాగ్యరెడ్డి వర్మ, ఏ హిందూ పురాణేతిహాసాల్లోనూ పంచములనే పదం లేదని, ఈ ప్రాంతానికి మొట్టమొదటి నుండి స్థానికులైన ప్రజలు పంచములే కాబట్టి, ఇప్పటి నుండి ఆది ఆంధ్రులనే వ్యవహారం సరైనదని తీర్మానించాడు. 1917 నుండి 1938 వరకు ఆది ఆంధ్రమహాసభలు దాదాపు ప్రతిసంవత్సరం జరిగాయి. అంటరానివారిని ఆది హిందువులుగా పిలవాలని డిమాండు చేశారు. ఈ ఆది ఆంధ్ర మహాజనసభల ప్రభావంతో 1931 జనాభా లెక్కలలో మాల, మాదిగ, ధేర్, చమర్ లాంటి వారికి నిజాం ప్రభుత్వం ఆదిహిందువులుగా పేర్కొన్నది. 1933 కల్లా ఆది-హిందూ సోషల్ సర్వీసు లీగు ఆధ్వర్యంలో 26 పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో దాదాపు 2600 మంది విద్యార్థులకు చదువు చెప్పేవారు. ఈయన స్మారకంగా 1943లో ఆయన కొడుకు మాదరి భాగ్య గౌతమ్ ప్రారంభించిన భాగ్య స్మారక బాలికల పాఠశాలను ఆ తరువాత మనవడు అజయ్ గౌతమ్ నడిపిస్తున్నాడు. దళితత్రయం ------------------ హైదరాబాదు సంస్థానంలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి మరియు బి.ఎస్.వెంకట్రావులను ముగ్గురినీ దళితత్రయంగా పరిగణిస్తారు. మత విశ్వాసాలు ------------------------ భాగ్యరెడ్డివర్మకు హిందూమతంపై విశ్వాసం ఉండేది కాదు. మొదట్లో అర్య సమాజం, బ్రహ్మసమాజం బోధనలను పాటించేవాడు. బ్రహ్మసమాజం వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించడం, యజ్ఞోపవితాన్ని త్యజించడం వంటి భావనల వల్ల బ్రహ్మ సమాజం వైపు మొగ్గుచూపాడు అయితే అర్య సమాజంలో చేరిన దళితులకు ఇతర అగ్రకులాల నుండి ఆర్యసమాజంలో చేరిన వారితో సమానంగా గౌరవం లభించడంలేదని గమనించాడు. ఆర్య సమాజం, బ్రహ్మసమాజం ఏవీ దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని భావించి బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. గౌతమ బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛ మొదలైన అంశాలపట్ల ఆకర్షితుడయ్యాడు. 1913 నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపుకొనేవాడు.తన ఏకైక కుమారునికి గౌతమ్ అని పేరు పెట్టుకున్నాడు. ఆర్యసమాజం 1913 లో ఆయనకు "వర్మ" అనే బిరుదును ప్రదానం చేసింది
Admin
Famous TV